లోటస్ పాండ్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
*ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు
*ప్రత్యేక ఆకర్షణగా పోతురాజుల వేషాలు
*సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ
*పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు
చిత్రం న్యూస్, జమ్మికుంట: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకుంటారని ఈ పండుగకు చాలా విశిష్టత ఉన్నదని లోటస్ పాండ్ పాఠశాల కరస్పాండెంట్ చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని లోటస్ పాండ్ పాఠశాలలో ఆషాడ మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బోనాల జాతర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీనవదుర్గ చిత్రపటానికి పూలమాల వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రత్యేక మట్టి కుండలో వండిన బోనాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో తరాల నుండి అవలంభిస్తున్న ఈ గొప్ప సాంప్రదాయం ఎటువంటి లోటు పాటు లేకుండా కొనసాగించడం చాలా శుభపరిణామం అని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలు కేవలం పల్లెల్లోనే కాకుండా నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తూ అమ్మవారికి బోనాలను సమర్పించి ఆప్యాయతలను చూపిస్తున్నారని అన్నారు. బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అదే సంప్రదాయాన్ని నేటి తరం కొనసాగించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతని సంపత్ రావు అన్నారు.
విద్యార్థులు ప్రదర్శించినటువంటి బోనాల పాటలపై నృత్యాలు అందరినీ ఆకర్షింపచేశాయి. విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణం సృష్టించారు. ప్రత్యేకంగా పోతురాజుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరిచాయి. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.