మీ కోసం పోలీస్ అవగాహన కార్యక్రమంలో బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. వెంకటేశ్వరరావు,
ఎస్ఐ ప్రవీణ్
చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని దన్నూరు (బి) గ్రామంలో మంగళవారం మీకోసం పోలీస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో బోథ్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ.వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ లు మాట్లాడుతూ.. శాంతి భద్రతలే మా ప్రథమ కర్తవ్యమని, మీకోసం పోలీస్ కార్యక్రమం ప్రజలకు మరింత చేరువ చేయడానికేనని పేర్కొన్నారు. అలాగే పలు అంశాలపై గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా భూ తగాదాల విషయమై సమస్యలను, మత్తు మాదకద్రవ్యాలు వల్ల నష్టాలు, మద్యం సేవించడం వల్ల జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు, సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు వీటి పైన గ్రామస్తులకు వివరిస్తూ తగు జాగ్రత్తలను సూచించారు. ముఖ్యంగా మానసికంగా ప్రతి సమస్య ఎదుర్కోవాలని, ఆత్మహత్యలే పరిష్కారం ఒకటే జీవితానికి కాదని, ఆలోచనతో ముందుకు సాగాలని తెలిపారు. ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగిన తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కష్టపడి పని చేసుకొని బ్రతకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంత వారినైనా శిక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు పోలీస్ సిబ్బంది, యువత, తదితరులు పాల్గొన్నారు.
