యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలి
_మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
*బోథ్ మండలం కౌట (బి) గ్రామం లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ యువత, ప్రజలు, విద్యార్థులు
* పోలీసు, వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు
చిత్రం న్యూస్, బోథ్: యువత సన్మార్గం వైపు పయనిస్తూ చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం సాయంత్రం బోథ్ మండలం కౌట (బి) గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని యువతకు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. మొదటగా జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికిన విద్యార్థులు, ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న స్థితిగతులపై, బోథ్ మండలంలో ఉన్న యువత ప్రజలు మొబైల్ ఫోన్ వాడకం వినియోగం ఎక్కువగా జరుగుతున్న వాటిపై జిల్లా ఎస్పీకి వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు. గ్రామంలోని ఎందరో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారని వారిని స్ఫూర్తిగా తీసుకొని తాము ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు. యువతకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించి వాటి బారిన పడితే కలిగే అనర్ధాలపై వివరించారు. ముఖ్యంగా విద్యార్థినిలకు అండగా ఆదిలాబాద్ జిల్లా షీ టీం బృందం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఎలాంటి సహాయ సహకారమైన 871265953 నెంబర్ కి సంప్రదించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రత్యేక కార్యచరణ రూపొందించి అవలంబించడం జరుగుతుందని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు మెసేజ్ యువర్ ఎస్పీ అనే కార్యక్రమంలో ద్వారా ప్రారంభించబడిన 8712659973 నెంబర్ కి సమాచారం అందించవచ్చని తెలిపారు. యాంటి డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన , చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థులచే మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేయించి వారిని యాంటీ డ్రగ్ సోల్జర్ గా పని చేయాలని తెలిపారు. గంజాయి పండించి,న వ్యాపారం చేసిన, సేవించినా చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ప్రభుత్వం ద్వారా వచ్చే ఎలాంటి లబ్ది వారికి చేయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్, గ్రామ పెద్దలు, యువత, చిన్నారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.