చిత్రం న్యూస్, శంకరపట్నం: అక్షరాస్యత లేని తమకు మోసపూరితంగా భూమిని పట్టా చేసుకున్నారని సదరు వ్యక్తి రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన చింతిరెడ్డి శాంతమ్మ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బాధితురాలు శాంతమ్మ మంగళవారం విలేకరుల ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన చింతిరెడ్డి పుల్లారెడ్డి-శాంతమ్మ కు సంతానం లేక పోవడంతో దగ్గరి బంధువైన గూడెపు సంతోష్ రెడ్డి తండ్రి వీరారెడ్డిలు జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పారన్నారు. దీంతో బ్యాంకులో రుణం తీసుకునేందుకు మార్టిగేజ్ చేసుకుంటానని నమ్మబలికించి ఇద్దరికీ చెందిన భూములు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని శాంతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్ల క్రితం పుల్లారెడ్డి మరణించగా ఒంటరిగా ఉంటున్న శాంతమ్మ ఆలనా పాలన చూసుకోకుండా భార్య భర్తల పేరిట ఉన్న 7 ఎకరాల భూమిని సంతోష్ రెడ్డి అనే వ్యక్తి పేరిట పట్టా చేయించుకున్నాడు. చదువురాని తనకు అక్షరాలు వచ్చినట్లు దొంగతనంగా పట్టా మార్పిడిలో సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. మోసపూరితంగా అక్రమంగా సంతోష్ రెడ్డి చేసుకున్న పట్టాను రద్దు చేసి తన పేరిట పట్టా అమలు పరచాలని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో శాంతమ్మ పేర్కొన్నారు.