పంబాల కులస్తులకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి
చిత్రం న్యూస్,శంకరపట్నం: పంబాల కులస్తులకు తహసీల్దార్ కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర పంబాల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రిటైర్డ్ జైలర్ కొరిమి నరసింహస్వామి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కు మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్టిఫికెట్లు ఇంతవరకు పంబాల కులస్తులకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో షెడ్యూల్ క్యాస్ట్ ను ఏ, బీ,సీ లుగా తీర్మానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కుల సర్టిఫికెట్లు కావాలని తహసీల్దార్ వద్దకు వెళ్లామని, సదరు అధికారి మా పరిధిలో లేదని చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు. ధ్రువీకరణ పత్రం కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నామని నరసింహస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పంబాల కులస్తులకు తహసీల్దార్ ద్వారా కుల, ఆదాయ,నివాస ధ్రువీకరణ పత్రాలు వెంటనే జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో గొట్టే అంజయ్య, రౌతుఅభిలాష, కోరమి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.