Chitram news
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 5:22 pm Editor : Chitram news

ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఆదిలాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం

*రూ.58.85 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

*3 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు

*త్వరలో విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన

*స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసి, స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.58.85 కోట్లతో నిర్మించిన నూతన ఐటీ టవర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల కొరతతో నిలిచిపోయిన ఐటీ టవర్ నిర్మాణాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి పొందేలా ఐటీ సంస్థలను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ టవర్‌లో టాస్క్ శిక్షణ కేంద్రం, ఇంక్యుబేషన్ హబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్టీటీ డేటాలో 300 మంది, ఎన్ ల్యాబ్స్‌లో 250 మంది, వైడర్ సాఫ్ట్‌వేర్‌లో 20 సీట్లు, పోస్ట్రిట్ ఏఐలో 50 మందికి ఉపాధి కల్పించేలా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని వెల్లడించారు. స్థానిక యువతకు సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆదిలాబాద్‌లో 3 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. తొలివిడతలో 2 వేల ఎకరాలు, రెండో విడతలో మరో వెయ్యి ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, భూసేకరణ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి త్వరలో శంకుస్థాపన చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. గతంలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సాంకేతిక, విధానపరమైన సమస్యలను పరిష్కరించి పరిశ్రమ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ జి. నగేష్ మాట్లాడుతూ..ఐటీ టవర్ ప్రారంభం జిల్లా యువత భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. విమానాశ్రయం, జాతీయ రహదారులు, రైల్వే, సీసీఐ పునరుద్ధరణ వంటి ప్రాజెక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఐటీ టవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, ఐటీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగావకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో మరో ఐటీ టవర్ మంజూరు చేయాలని కోరారు. స్థానిక పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ..ఆదివాసీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. ఐటీ, పారిశ్రామిక సంస్థల్లో స్థానిక ఆదివాసీ యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని, ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ సెక్రటరీ లు అనుదీప్, శశాంక, అదనపు కలెక్టర్లు ఎస్. రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్రు, ఎస్పీ అఖిల్ మహాజన్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శివప్రసాద్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఐటీ శాఖ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.