Chitram news
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 4:39 pm Editor : Chitram news

పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

బాలల హక్కులు, రక్షణపై ప్రత్యేక కార్యక్రమం

చిత్రం న్యూస్, బేల: మండలంలోని పాఠన్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పోక్సో (POCSO) చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్య అంశాలను వివరించారు. బాలలపై జరిగే లైంగిక నేరాలు, వాటి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి, ఆపద సమయంలో ఎవరిని సంప్రదించాలి అనే విషయాలను తెలిపారు.

బాలల హక్కులు, రక్షణకు సంబంధించిన 1098, 100, 181 టోల్‌ఫ్రీ నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా, అనుచితంగా ప్రవర్తించినా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఆపదలో ఉన్న బాలలు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. ప్రతి విద్యార్థి బాలల రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రమేష్, సఖి అడ్మినిస్ట్రేటర్ నాగమణి, బి. సతీష్, ఉపాధ్యాయులు వైష్ణవ్, శ్రీకాంత్, అంగన్‌వాడీ టీచర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.