పీహెచ్‌సీలో అధికారులు మారిన.. బోర్డుపై పేర్లు మారలే
చిత్రం న్యూస్, జైనథ్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన వైద్యుల, సిబ్బంది పేర్లు ఇప్పటికీ ‘సిబ్బంది వివరాల బోర్డు’పై దర్శనమిస్తున్నాయి. నెలలు గడుస్తున్నా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వైద్యులు, సిబ్బంది వివరాలను బోర్డుపై నమోదు చేయకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు సరైన సమాచారం అందక ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సిబ్బంది వివరాల బోర్డును అప్‌డేట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.