Chitram news
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 6:20 pm Editor : Chitram news

వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

ఆదిలాబాద్‌లో ఘనంగా శోభాయాత్ర.. భక్తిశ్రద్ధలతో పూజలు

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: విశ్వకర్మ మరాఠీ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను శుక్రవారం ఆదిలాబాద్‌లో వైభవంగా నిర్వహించారు. సెంట్రల్ గార్డెన్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మాజీ మంత్రి జోగు రామన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ సంతోష్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ చిట్యాల సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నేత గండ్రత్ సుజాత, బీజేపీ నాయకులు పాయల్ శరత్, నగేష్, బీసీ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు తదితరులు పాల్గొని విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కులస్తులంతా ఐక్యంగా ఉంటేనే సమాజం మరింత అభివృద్ధి సాధించగలదని అన్నారు. విశ్వకర్మ సమాజం అభివృద్ధికి తమ వంతు సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

భారీ శోభాయాత్ర

జయంతి వేడుకల్లో భాగంగా విశ్వకర్మ విగ్రహంతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. సెంట్రల్ గార్డెన్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర నేతాజీ చౌక్, వినాయక్ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, ఠాకూర్ హోటల్ మీదుగా చందా వాగు వరకు కొనసాగింది. శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, నృత్యాలతో సందడి చేశారు. దారి పొడవునా భక్తి గీతాలు ఆలపిస్తూ, విశ్వకర్మ భగవానుడి నామస్మరణతో ఉత్సాహంగా ముందుకు సాగారు. దీంతో ఆదిలాబాద్ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో విశ్వకర్మ మరాఠీ వడ్రంగి సంఘం జిల్లా అధ్యక్షుడు జాన్వె సంతోష్, ప్రధాన కార్యదర్శి ఎం.దిలీప్ తో పాటు వివిధ మండలాలకు చెందిన సంఘం నాయకులు, కులస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.