*కళా అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివారం పట్టణంలో కళా అకాడమీ ప్రారంభమై నాలుగు నెలలు పూర్తికావడంతో తొలి బ్యాచ్ విద్యార్థుల కోర్సు పూర్తయిన సందర్భంగా సర్టిఫికెట్ల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెల్పి సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్‌లో మా స్వగ్రామం అయిన ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామ మిత్రుడు గణేశ్ కుమార్తె వైష్ణవి గొప్ప ఆలోచనతో ఈ కళా అకాడమీని ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాల్లో అందుబాటులో ఉండే ఇలాంటి అకాడమీని ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. వైష్ణవి నైపుణ్యానికి పెద్ద కంపెనీలలో అవకాశాలను అన్ని వదులుకొని సొంత ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషమన్నారు.
ఆదిలాబాద్ జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా యువతీ, యువకులు కొత్త నైపుణ్యాలను నేర్చుకుని భవిష్యత్తులో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ పరమేశ్వర్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, అమన్ ఫౌండేషన్ చైర్మన్ అరఫాత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.