ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: సీఐ దీపక్
చిత్రం న్యూస్ బాసర : నిర్మల్ జిల్లా బాసర మండల పరిధిలోని గ్రామీణ ప్రాంత ప్రజలు, వినాయక మండపాల నిర్వాహకులు చట్ట నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ దీపక్ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మండప నిర్వాహకులకు సూచించారు.మండలంలోని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే ప్రతీ గణేష్ మండపానికి సంబంధిత మీ సేవ (Meeseva) కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకుని పోలీసు అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. విద్యుత్,అగ్నిమాపక భద్రత,విద్యుత్ లైన్లకు అంతరాయం కలగకుండా, అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉత్సవాల్లో డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్‌ను ఉపయోగించడం పూర్తి నిషేధమని, నిర్ణీత సమయంలోనే సౌండ్ బాక్సులను ఉపయోగించాలన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు పర్యవేక్షించాలన్నారు. మద్యపానం, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకూడదని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో పండగ జరుపుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు స్థానిక పోలీసులకు గ్రామస్థులు, నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు,ప్రజా ప్రతినిధులు , ఆయా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు