మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం: మాజీ మంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్, జైనథ్: యావత్ రైతాంగం కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా ఉందని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రైతులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకోవడం తనను ఎంతగానో ఆనందపరిచిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ, కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలతో బసవన్నలను అలంకరించి రైతులు తమ అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. శనివారం మాజీ మంత్రి జోగు రామన్న కరంజి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు, మహిళలు జోగు రామన్నను మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులను ఆత్మీయంగా కలుసుకుని పలకరించారు. పొలాల పండుగ సందర్భంగా “రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి” అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన రైతులను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. దళిత కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం దళిత బస్తీ, దళిత బంధు వంటి పథకాలను అమలు చేశారని, రూ.10 లక్షల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బస్తీ పథకం ద్వారా కేటాయించిన భూముల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం బోర్లు వేయకపోవడం అమానుషమని విమర్శించారు. ప్రతి చేనుకు బోరు సౌకర్యం కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన బోర్లను ఇప్పటివరకు రైతుల చేలల్లో వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు, రైతుబీమా, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండించారు. వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని, వ్యవసాయంపై ఉన్న మక్కువతోనే కేసీఆర్ తన నివాసాన్ని పంట పొలాల మధ్య నిర్మించుకున్నారని పేర్కొన్నారు. రైతాంగానికి అండగా నిలిచిన కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం కొనసాగిస్తే రానున్న రోజుల్లో రైతుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని జోగు రామన్న హెచ్చరించారు.