మట్టి వినాయకుల తయారీలో విద్యార్థుల ప్రతిభ
చిత్రం న్యూస్, బేల: వినాయక చవితి సందర్భంగా బేల ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టితో వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేసి తమ సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మట్టి వినాయకుల తయారీ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా మట్టితో వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను రూపొందించి, వాటిని అలంకరించారు. అనంతరం తయారు చేసిన మట్టి వినాయకులకు పూజా కార్యక్రమం నిర్వహించారు. మట్టి విగ్రహాల వినియోగం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.