దళితులను కించపరిచేలా వ్యవహరించిన బీజేపీ నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : కాంగ్రెస్ నేతల డిమాండ్
చిత్రం న్యూస్, బేల: రాం లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ముగిసిన అనంతరం, అక్కడ ‘శుద్ధీకరణ’ పేరిట యజ్ఞం నిర్వహించి దళితుల మనోభావాలను దెబ్బతీసిన ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో దళితులను కించపరిచేలా వ్యవహరించిన ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి కదరపు దేవిదాస్, బేల మండల ఎస్సీ డిపార్ట్‌మెంట్ అధ్యక్షుడు నడికుంట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదును అందజేశారు. దళితుల పట్ల వివక్ష చూపిన సదరు నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బేల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ రాందాస్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, ఉప సర్పంచ్ సాగర్ అబ్దుల్ కరీం, ఘన్ శ్యామ్, యూత్ అధ్యక్షుడు రాజు, సర్పంచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.