Chitram news
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 5:58 pm Editor : Chitram news

హల్ద్వానీ “శుద్ధీకరణ” ఘటనపై FIR నమోదు చేయాలి – బిక్కీ గంగన్న

హల్ద్వానీ “శుద్ధీకరణ” ఘటనపై FIR నమోదు చేయాలి – బిక్కీ గంగన్న

చిత్రం న్యూస్, జైనథ్: ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న సభ అనంతరం “శుద్ధీకరణ” కార్యక్రమం నిర్వహించిన వారిపై SC/ST అట్రాసిటీ చట్టం కింద FIR నమోదు చేయాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం కార్యదర్శి బిక్కీ గంగన్న డిమాండ్ చేశారు. సోమవారం జైనథ్ పోలీస్ స్టేషన్ లో జైనథ్, సాత్నాల ఎస్సీ విభాగం అధ్యక్షులతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిక్కీ గంగన్న మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించిందని, ఒక దళిత నాయకుడు పాల్గొన్న సభా ప్రదేశాన్ని శుద్ధీకరణ పేరుతో శుభ్రం చేయడం కుల వివక్షకు, మనువాద భావజాలానికి నిదర్శనమని అన్నారు. “బీజేపీకి దళితులంటే ఎందుకు ఇంత చిన్నచూపు? దళితులు కేవలం ఓట్లు వేయడానికేనా? జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎదగకూడదా?” అని ప్రశ్నించారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదని, కోట్లాది దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు. ఈ ఘటనను బహిరంగంగా సమర్థించిన ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మహేంద్ర భట్ పాత్రపై కూడా దర్యాప్తు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైనథ్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కోడిచెర్ల పొచ్చన్న, సాత్నాల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుమ్మడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.