నీట్-పీజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని నలంద కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్-పీజీ (NEET-PG) ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును, కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన మౌలిక వసతులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్ష గదులను సందర్శించిన కలెక్టర్.. నిబంధనల మేరకు పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కేంద్రంలో మొత్తం 100 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.
అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియ, బయోమెట్రిక్ తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలన్నారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి, డీఐవో గణేశ్ జాదవ్, పరీక్షల లైజన్ అధికారి శ్రీధర్, తహసీల్దార్ వేణు, అధికారులు, కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.