బిరైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది : మాజీ మంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌లో మార్పులు చేసి అనుకుంట గ్రామ రైతులకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం శాంతినగర్‌లోని తన నివాసానికి వచ్చిన అనుకుంట గ్రామ రైతులు, గ్రామస్తులతో మాజీ మంత్రి జోగు రామన్న సమావేశమయ్యారు. గ్రామస్తులు తమ సమస్యలను వివరించి, ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకుండా అనుకుంట గ్రామస్తులను అయోమయం, ఆందోళనకు గురిచేయడం సరికాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు, గ్రామస్తులకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
గతంలో కలెక్టర్ హైమద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే, ప్లానింగ్ ప్రకారమే ఎయిర్‌పోర్ట్ నిర్మాణ నిర్ణయాలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారని తెలిపారు. గతంలో రూపొందించిన ప్రణాళికను పక్కన పెట్టి కొత్తగా అనధికారిక డీపీఆర్ రూపొందించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకుని ఉన్న అనుకుంట గ్రామం సుమారు 800 ఎకరాల వ్యవసాయ భూములపై ఆధారపడి ఉందని అన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్న భూములు 68 సర్వే నంబర్‌లో ఉన్నప్పటికీ, వాటిపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని నిలదీశారు. స్వలాభం కోసం డీపీఆర్‌ను మార్చి రైతుల భూములకు నష్టం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై పూర్తి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అనుకుంట గ్రామ రైతులు, గ్రామస్తులకు శాశ్వత పరిష్కారం లభించే వరకు వారి పక్షాన నిలబడి పోరాడుతామని జోగు రామన్న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రి, మంచాల మల్లయ్య, కడదరపు అశోక్, రావుల రమేష్, భూమయ్య, మోహిన్, రావుల సోమన్న, జక్కుల సత్యనారాయణ, బండి సాగర్, దూడ రాజేశ్వర్, ముఖ్యర శ్రీను, కమిటీ రమేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.