పెన్ గంగా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన కన్నె పవన్ కుమార్ అనే యువకుడు శనివారం పెన్ గంగా నదిలో పడి గల్లంతైన సంగతి తెలిసిందే. కాగా.. ఆదివారం నదిలో అతని మృతదేహం లభ్యమైంది. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. యువకుడు నదిలో గల్లంతయిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రంగంలోకి దిగాయి. శనివారం నుండి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం కౌట గ్రామం సమీపంలో పవన్ కుమార్ మృతదేహం దొరికినట్లు జైనథ్ ఎస్ఐ (SI) పవర్ గౌతమ్ తెలిపారు. మృతుడు పవన్ కుమార్‌కు భార్య, ఓ పాప ఉన్నారు. చేతికి వచ్చిన కొడుకు, ఇంటికి యజమాని అయిన పవన్ నదిలో పడి మరణించడంతో ఉమ్రి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. భార్య, కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పవన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా, ప్రమాదవశాత్తు మృతిచెందాడ అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.