Chitram news
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 9:02 pm Editor : Chitram news

గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధికి పెద్దపీట

* పిట్టబొంగారంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

* ‘ఆరు సూత్రాల’ ప్రణాళికతో గిరిజన గ్రామాల రూపురేఖలు మారుస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి గిరిజన గ్రామం మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, వ్యవసాయాభివృద్ధి, మహిళా సాధికారతతో ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవాలన్నదే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల పిట్టబొంగారం గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో మంద మకరందు తో కలిసి జిల్లా కలెక్టర్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి కొత్త రూపు తీసుకొచ్చే పలు మౌలిక వసతులను ప్రజలకు అంకితం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన ప్రహరీ గోడ, పర్ధాన్ కమ్యూనిటీ హాల్, నూతన గ్రామపంచాయతీ భవనం, నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ఐటీడీఏ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ‘ఆరు సూత్రాల అభివృద్ధి ప్రణాళిక’ను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకునేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో మాతా–శిశు మరణాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి గర్భిణి రిమ్స్ ఆసుపత్రిలో టిఫా స్కాన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణిపై ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

గిరిజన విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకు FLN, 6 నుంచి 10వ తరగతి వరకు LIP కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో నెలకొనే సమస్యలను తక్షణమే పరిష్కరించి మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు.

వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు జలసిరి పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో వ్యవసాయ కుంటలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పథకం కింద రూ.90 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ఆర్థిక సహాయం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. లావుని పట్టా భూములకు సంబంధించిన బ్యాంకు రుణాల సమస్యలను ఎంఆర్‌వోల ద్వారా తక్షణమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించి అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు మాట్లాడుతూ, మారుమూల గిరిజన గ్రామాలకు, పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. పిహెచ్‌సీ ప్రహరీ గోడతో ఆసుపత్రికి రక్షణ మెరుగుపడుతుందని, కమ్యూనిటీ హాల్ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ, గిరిజన ప్రజల సంక్షేమానికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, సర్పంచ్ మాదవి ఇంద్రదేవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి వనిత, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.