బెల్లూరిలో విద్యుత్ తీగలు తెగిపడి నాలుగు ఆవులు మృత్యువాత
చిత్రం న్యూస్, జైనథ్: మండలంలోని బెల్లూరి గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ గాలివాన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ తీగలు తెగి కిందపడటంతో నాలుగు ఆవులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాయి. రాత్రి వేళ ఒక్కసారిగా వీచిన బలమైన గాలుల వల్ల విద్యుత్ లైన్లు తెగిపడ్డాయని స్థానిక రైతులు తెలిపారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఆవులు ఆ తీగలను తాకడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయని తెలిపారు. ఈ ఘటనతో లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.