పర్వతగిరిలో సనాతన హిందూ సేవా సమితి ఉదారత
గోమాతలకు గ్రాసం, పేద కుటుంబానికి నిత్యావసరాల పంపిణీ
చిత్రం న్యూస్ (పర్వతగిరి), వరంగల్: సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న సనాతన హిందూ సేవా సమితి పర్వతగిరిలో మరోసారి తన ఉదారతను చాటుకుంది. సంస్థ ఆధ్వర్యంలో ఒకే రోజు రెండు విభిన్న వినూత్న సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

గోమాతలకు రెండు నెలల గ్రాసం పంపిణీ: సమితి ఆధ్వర్యంలో 186వ సేవా కార్యక్రమాన్ని స్థానిక గోశాలలో చేపట్టారు. గోరక్షణలో భాగంగా గోశాలలోని గోమాతలకు రెండు నెలలకు సరిపడా ఎండుగడ్డి (గ్రాసం) అందజేశారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా: చిన్న వయసులోనే భర్తను కోల్పోయి, ఇద్దరు ఆడపిల్లల చదువులు, పోషణ భారంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కట్టా రాధిక అనే మహిళను సమితి సభ్యులు ఆదుకున్నారు. 187వ కార్యక్రమంగా ఆమె కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో సనాతన హిందూ సేవా సమితి వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, సలహాదారు అంచూరి వేణుగోపాల్, ప్రతాపగిరి గణేష్, గ్రూప్ సభ్యులు గంగిడి ధర్మారెడ్డి, పేర్ణ భరత్ తదితరులు పాల్గొన్నారు.
