ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఎస్సీ విభాగం పదవులకు దరఖాస్తుల స్వీకరణ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల నియామకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ విభాగం నియామక పరిశీలకులు సమతా సుదర్శన్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆశావహులకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందనడానికి ఎస్సీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతలే నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సేకరించిన దరఖాస్తులను తదుపరి పరిశీలన కోసం గాంధీ భవన్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.మరో ముఖ్య అతిథి సమతా సుదర్శన్ మాట్లాడుతూ ఎఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరుగుతోందని వివరించారు. దేశంలో అన్ని కులాలు, వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ తన్వీర్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దీపక్, మాధవ్ పటేల్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు బండి దేవిదాస్ చారి, గౌలి సంజీవ్, తదితర ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
