బేల మండలంలో పశు సంవర్ధక ప్రదర్శన: ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, బేల: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశుపోషణ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం బేల మండలం సిర్సన్న గ్రామంలో పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అవగాహన సదస్సు, ‘మేలు జాతి దూడల ప్రదర్శన’ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై, కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.నిరుద్యోగ యువత పాడి పరిశ్రమను ఉపాధి మార్గంగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.రైతులకు అవసరమైన మేలు రకం గడ్డి విత్తనాలు, గడ్డి కటింగ్ మిషన్లను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.పాడి రైతుల సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ఉత్తమంగా పెంచిన ముర్రా గేదె దూడలు, దేశీవాళీ ఆవు దూడల యజమానులకు కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జె.డి రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్ స్వామి, బేల వ్యవసాయ అధికారి సాయి తేజ, బేల పశువైద్య అధికారి దీప్ రధన్, ఎంపీఓ మహేష్, సర్పంచ్ పోచక్క, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
