వైకల్యంపై గెలిచిన పట్టుదల: రెండు చేతులు లేకున్నా పదో తరగతిలో సత్తా చాటిన సాయి చరణ్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: శారీరక వైకల్యం లక్ష్య సాధనకు అడ్డంకి కాదని పట్టుదలతో నిరూపించాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మార్కొండు సాయి చరణ్. విద్యుత్ ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయినా, ఏమాత్రం అధైర్యపడకుండా పదో తరగతి ఫలితాల్లో మెరుగైన మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో సాయి చరణ్‌ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి చరణ్ సాధించిన ప్రతిభను చూసి కలెక్టర్ ముగ్ధులయ్యారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సాయి చరణ్ 417 మార్కులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, అతడిని ఘనంగా అభినందించారు. గతంలో జరిగిన ఒక దురదృష్టకర విద్యుత్ ప్రమాదంలో సాయి చరణ్ తన రెండు చేతులను కోల్పోయాడు. ఆ క్లిష్ట పరిస్థితిలోనూ కుంగిపోకుండా, అంగవైకల్యాన్ని ఒక సవాలుగా స్వీకరించి చదువులో రాణించాడు. సాయి చరణ్ ఆత్మవిశ్వాసం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కొనియాడారు. సాయి చరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అతడి ఉన్నత చదువులకు, ఇతర అవసరాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆపదలో ధైర్యం కోల్పోకుండా శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుందని చెప్పడానికి సాయి చరణ్ ఒక రోల్ మోడల్ అని కలెక్టర్ పేర్కొన్నారు.
