వానకాలం సాగుపై రైతులకు అవగాహన సదస్సు
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో రైతులకు వానాకాలం సాగుపై వ్యవసాయ అధికారులు గురువారం అవగాహన కల్పించారు. వానాకాలంలో సాగు సన్నద్ధత, కల్తీ విత్తనాల నివారణ, విత్తనాల కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) శ్రీధర్ రైతులతో మాట్లాడుతూ, రైతులు విత్తనాలను ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన విత్తన డీలర్ దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాల రశీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలని తెలిపారు. లూజు విత్తనాలు లేదా కల్తీ విత్తనాలు, ముఖ్యంగా హెచ్‌టీ కాటన్ (HT Cotton) విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా కల్తీ విత్తనాల విక్రయానికి పాల్పడితే వెంటనే వ్యవసాయ, పోలీస్, మండల టాస్క్ ఫోర్స్ బృందానికి సమాచారం అందించాలని కోరారు. రైతులు ఒకే రకం పత్తి విత్తనాలపై ఆధారపడకుండా, వివిధ రకాల పత్తి విత్తనాలను సాగు చేయడం ద్వారా పంటలో రిస్క్‌ను తగ్గించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయి తేజ, వ్యవసాయ విస్తరణ అధికారులు వినయ్ కుమార్, ఉమర్, గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి, ఉప సర్పంచ్ శేఖర్, రైతులు మహేందర్ ప్రవీణ్, నితిన్, అమోల్ తదితరులు పాల్గొన్నారు.
