వృద్ధురాలికి అండగా నిలిచిన సనాతన హిందూ సేవా సమితి
చిత్రం న్యూస్, వరంగల్: అభాగ్యులకు అండగా నిలవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ‘సనాతన హిందూ సేవా సమితి’ మరోసారి చాటుకుంది. సమితి ఆధ్వర్యంలో బుధవారం 181వ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ నగరంలోని కొత్తవాడకు చెందిన వృద్ధురాలు అనుమాండ్ల సుజాత గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఆమె దీనస్థితిని తెలుసుకున్న సేవా సమితి సభ్యులు స్పందించి, ఆమెకు రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రూప్ వ్యవస్థాపకులు తాళ్లపల్లి నగేష్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సలహాదారు ప్రతాపగిరి గణేష్, సభ్యులు గంగిడి ధర్మారెడ్డి, బండారి సంపత్, మరియు దిడ్డి మోహన్ తదితరులు పాల్గొని వృద్ధురాలికి సాయం అందజేశారు. తమకు అండగా నిలిచిన సేవా సమితి సభ్యులకు ఈ సందర్భంగా సుజాత కృతజ్ఞతలు తెలిపారు.
