Chitram news
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 9:34 pm Editor : Chitram news

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి: మంత్రుల ఆదేశం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి: మంత్రుల ఆదేశం

చిత్రం న్యూస్, హైదరాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు నియోజకవర్గాల వారీగా జరుగుతున్న నిర్మాణ పనులపై ఆరా తీశారు.

ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, బేస్‌మెంట్, రూఫ్ లెవెల్ పనులను వేగవంతం చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని, నాణ్యతను జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని, జాప్యం చేస్తే చర్యలు ఉంటాయని మంత్రులు హెచ్చరించారు. అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు అందేలా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎంపీలు గోడం నగేష్‌, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్‌, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్‌ సాగర్‌ రావు, గడ్డం వినోద్‌, రామారావు పటేల్‌, పాయల్ శంకర్‌, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీశ్‌ బాబు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్‌ కుమార్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌, జిల్లా కలెక్టర్లు రాజర్షి షా, హరిత, భవేశ్‌ మిశ్రా, కుమార్‌ దీపక్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.