రైతుల సమస్యలపై మంత్రి తుమ్మలతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భేటీ
చిత్రం న్యూస్, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని శనగ, జొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రస్తుత సాగు పరిస్థితులు, రైతుల ఇబ్బందులను వివరిస్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
జిల్లాలో బెంగాల్‌గ్రామ్ (శనగ) కొనుగోలు లక్ష్యం ఇప్పటికే పూర్తయిందని, అయితే ఇంకా సుమారు 1.5 లక్షల క్వింటాళ్ల శనగ నిల్వలు రైతుల వద్దే ఉండిపోయాయని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. దీనివల్ల రైతులు పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు పరిమితిని పెంచి తక్షణమే సేకరణ చేపట్టాలని కోరారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది సుమారు 1.6 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగు అయిందని, దాదాపు 13 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా లేని నేపథ్యంలో, రైతులు నష్టపోకుండా ఉండేందుకు వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. కనీస మద్దతు ధర (MSP) కల్పించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.