ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, అదిలాబాద్: పట్టణంలోని టీటీడీసీ (TTDC) కేంద్రంలో శుక్రవారం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన రెండో దశ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణ పొందుతున్న వారికి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జనగణన ప్రక్రియలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అనంతరం, జనగణన విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి అవసరమైన కిట్లను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, శిక్షణార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.