Chitram news
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 9:42 pm Editor : Chitram news

సాంగిడి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయండి: మంత్రి జూపల్లికి సామ రూపేష్ రెడ్డి విజ్ఞప్తి

సాంగిడి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయండి: మంత్రి జూపల్లికి సామ రూపేష్ రెడ్డి విజ్ఞప్తి

చిత్రం న్యూస్, అదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామ శివారులో పెనుగంగ నది ఒడ్డున నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి కోరారు. బుధవారం ఉట్నూరు పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ. 5.40 కోట్ల భారీ వ్యయంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిందని, అయితే ప్రస్తుతం ఇది ఏమాత్రం వినియోగంలో లేక నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 400 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఒక్క ఎకరానికి కూడా నీరు అందడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఇందుకోసం అవసరమైన ఆనకట్ట నిర్మాణానికి సుమారు ఒక కోటి రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.