ఆదిలాబాద్‌లో నకిలీ జాబ్ స్కామ్ గుట్టురట్టు
చిత్రం న్యూస్, మావల, ఆదిలాబాద్: నిరుద్యోగులే లక్ష్యంగా నకిలీ ఉద్యోగ అవకాశాలతో మోసం చేస్తున్న ఒక వ్యక్తిని మావల పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ విమానయాన సంస్థ SpiceJet లో ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి, బాధితుల నుండి నిందితుడు భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని 37 ఏళ్ల వాగ్మారే రాజరత్నగా గుర్తించారు.
మోసం చేసిన తీరు: బాధితుడికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు (Appointment Letters) పంపి, SpiceJet లో ఉద్యోగం వచ్చినట్లు నమ్మించి మోసం చేశాడు. ఒక బాధితుడి నుండి నిందితుడు సుమారు ₹3.40 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుండి మొబైల్ ఫోన్ మరియు డిజిటల్ ఆధారాలను పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కు తరలించి, ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్యారంటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బు అడిగే వారిని నమ్మవద్దు. ఉద్యోగ సమాచారాన్ని కేవలం అధికారిక సంస్థల వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.