రిజిస్టర్ లో సంతకం పెట్టి.. పాఠశాలకు డుమ్మా కొట్టిన హెచ్ఎం
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు వచ్చి రిజిస్టర్ లో సంతకం పెట్టి పెళ్లి ఉందని డుమ్మా కొట్టి వెళ్ళిపోయాడు. సోమవారం విద్యార్థులు పాఠశాల ఆరు బయట ఎందుకు తిరుగుతున్నారని గమనించిన గ్రామ సర్పంచ్ మెస్రం దౌలత్ రావ్, ఉప సర్పంచ్ ఠాక్రె సాగర్ పాఠశాలకు వచ్చి విద్యార్థులను అడిగారు. ప్రధానోపాధ్యాయుడు జైవంత్ రావ్ బడికి వచ్చి సంతకం పెట్టి నేను వెళ్తున్నాను. మీలో ఒకరు చూసుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడని విద్యార్థులు సర్పంచ్, ఉపసర్పంచ్ లకు సమాధానం ఇచ్చారు. మా ప్రధానోపాధ్యాయులు బడికి వచ్చి ఎలాంటి పాఠాలు చెప్పకుండా కేవలం ఫోన్ చూస్తూ ఉంటాడని ఈ ప్రధానోపాధ్యాయుడు మాకు వద్దని సర్పంచ్ కి విద్యార్థులు చెప్పారు.
ఈ సందర్బంగా ఉప సర్పంచ్ ఠాక్రె సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులను బలోపేతం కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తుందని కానీ ఇలాంటి ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థుల భవిష్యత్తు ఏం బాగుపడుతుందని అన్నారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని ఒక్కరు ట్రైనింగ్ కోసం వెళ్లారని ఉన్న ప్రధానోపాధ్యాయులు కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఇలా చేయడం ఒక్కసారి కాదు పలుమార్లు ప్రధానోపాధ్యాయుడు వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయిన దాఖలాలు ఉన్నాయన్నారు. ప్రైవేట్ బడి వద్దు ప్రభుత్వ బడి ముద్దు అని మేము ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతానికి కృషి చేస్తే ఈ ప్రధానోపాధ్యాయుడి పనితీరు ఇలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి హెచ్ఎం రాథోడ్ జైవంత్ రావ్ ని వెంటనే సస్పెండ్ చేయాలనీ కోరారు.