ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలి
*పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: 2023లో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో జరిపిన డిప్యూటేషన్లలోనే ఉపాధ్యాయులు నేటికీ కొనసాగుతున్నారని ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలని పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో సర్దుబాటు ప్రక్రియ అవసరం లేనప్పటికీ ఉపాధ్యాయుల్ని మరో పాఠశాలకు తరలించారనే ఆరోపణలు ప్రస్తుత డీఈఓ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సిందని దాటవేశారన్నారు. అప్పటి కలెక్టర్ కి పీఆర్టీయూ తెలంగాణ ప్రాతినిధ్యం చేసినప్పటికీ డీఈఓ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా దాటవేశారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలు పక్కకు పెట్టి ఉపాధ్యాయులు, సంఘాల ప్రయోజనాల మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బదిలీలు, పదోన్నతులు పూర్తిచేసి నూతన డీఎస్సీతో కొత్త ఉపాధ్యాయులను నియమించినప్పటికీ అయినా సర్దుబాటు చేసిన వారు యథాస్థానాలకు రాకుండా అక్కడే కొనసాగుతున్నారన్నారు. తక్షణమే ఈ విద్యా సంవత్సరం ఆఖరి నాటికి ఉపాధ్యాయులను వారి సొంత పోస్టింగ్ లో పంపాలని, అన్ని కేటగిరీల డిప్యూటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు