Chitram news
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 4:58 pm Editor : Chitram news

జైనథ్ మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

జైనథ్ మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్,జైనథ్: రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారానే ఆర్థికంగా నిలదొక్కుకోగలరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జైనథ్ వ్యవసాయ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి తో కలిసి ఆయన అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, అధిక డిమాండ్ ఉండే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కట్కం రాందాస్, బీజేపీ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, బీజేపి నాయకులు పిడుగు సంతోష్ యాదవ్,చిలుకూరి లింగారెడ్డి, అశోక్ రెడ్డి, దేవన్న, వెంకట్ రెడ్డి, సారథి, మార్కెట్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.