ప్రజాపాలన లక్ష్యం అర్హులకు సంక్షేమం అందడమే: ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాలు, సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందడమే ప్రజాపాలన అసలు ఉద్దేశమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. ‘ప్రజాపాలన 99 రోజుల’ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్‌లోని ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన మున్సిపల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాలన సాగించాలన్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బ్యాంకుల నుండి రుణాలు పొందడమే కాకుండా, వాటిని సరైన మార్గంలో పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా ఎదగాలని కోరారు. అప్పుడే సంఘాల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని హితబోధ చేశారు.
వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ సమస్య తలెత్తినా పారదర్శకమైన పరిష్కారం లభించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిగతులను (Status) ఎప్పటికప్పుడు తెలుసుకునేలా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌లకు విజ్ఞప్తి చేశారు. సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు సిద్ధిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, వైస్ చైర్మన్ రోహిత్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్, డీవైఎస్ఓ శ్రీనివాస్, సంక్షేమ అధికారి మిల్కా, ట్రాఫిక్ ఎస్సై దేవేందర్, తహసిల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు అన్నపూర్ణ, స్వాతి, ధోని జ్యోతి, చరణ్ గౌడ్, మున్న జైస్వాల్, గంట జీవన్, విజయ్, ఆత్రం వేంకటేష్, నాగ్ సేన్, మహెబూబ్, సంజయ్, అంగన్వాడీలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.