-Advertisement-

ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దుబ్బ లోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో పూలే జయంతి వేడుక నిర్వహించారు.అంతకుముందు వినాయకనగర్ లోని మహాత్మ జ్యోతిబా ఫులే విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు మహాత్మ జ్యోతిబా ఫులే కొనసాగించిన కృషి అమోఘమని అన్నారు. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం చలించకుండా సాంఘిక దురాచారాలను దూరం చేసేందుకు ఫులే ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా విశేషంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపజేశారని అన్నారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం బీ.సీ గురుకులాలకు జ్యోతిబా ఫులే పాఠశాలలుగా నామకరణం చేస్తూ నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తోందన్నారు. మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే మన జీవితానికి కూడా సార్థకత చేకూరుతుందన్నారు. జ్యోతిబా ఫులే చూపిన బాటలో పయనిస్తూ, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. జయంతి సభలో మేయర్ ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ లు మాట్లాడుతూ, జ్యోతిబా ఫులే సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల బాధ్యులు బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్, నరేందర్ గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments