చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా నియామక ఉత్తర్వును శనివారం అందజేశారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఎంపికైన మొత్తం 16 మంది అభ్యర్థులకు ఆయన ఈ ఉత్తర్వులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు ఈ నియామకాలు ఆర్థిక భరోసానిస్తాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో వర్ణ, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.