Chitram news
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 3:21 pm Editor : Chitram news

ఆత్మాభిమానం కోసం పదవికి త్యాగం..ఎక్సైజ్ శాఖలో ‘ఈగో’ల పోరు

ఆత్మాభిమానం కోసం పదవికి త్యాగం..ఎక్సైజ్ శాఖలో ‘ఈగో’ల పోరు

డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆవేదన.!

చిత్రం న్యూస్, నిజామాబాద్ జిల్లా బ్యూరో: ఆకలితోనైనా చస్తాం కానీ ఆత్మాభిమానం వదులుకోలేం” అన్న కాళోజీ మాటలను నిజం చేస్తూ, ఒక ఉన్నతాధికారి తన ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట కొలువు చేయలేనని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, తన పై అధికారి చేసిన ఘోర అవమానాన్ని భరించలేక, తన ముప్పై ఏళ్ల సుదీర్ఘ సర్వీసును వదులుకుని శాఖ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన పడిన మానసిక సంఘర్షణ, ఆ గదిలో జరిగిన అవమానం గురించి ఆయన పంచుకున్న ముచ్చట్లు చదువుతుంటే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు.

​అసలేం జరిగింది..? సోమిరెడ్డి వివరణ ప్రకారం.. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో పై అధికారి (కమిషనర్) ఆయనను ఉద్దేశించి “వెధవ, ఇడియట్” అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. చేయని తప్పుకు అకారణంగా నిందిస్తుంటే, సోమిరెడ్డి చాలా సున్నితంగా “అలాంటి మాటలు అనొద్దు సార్” అని ఎదురు చెప్పారు. బహుశా వ్యవస్థలో ఎవరూ ఇన్నేళ్లుగా కమిషనర్ ని ఎదురు ప్రశ్నించి ఉండకపోవచ్చు. ఆ చిన్న మాట ఆయన ‘ఈగో’ను బాగా దెబ్బతీసింది. ఫలితంగా పది నిమిషాల పాటు నలుగురు అధికారులు, సిబ్బంది ముందే సోమిరెడ్డిని “వెధవాతి వెధవవు” అంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు. తనకు సంబంధం లేని పనులను అంటగడుతూ, బలవంతంగా తాను వెధవనని ఒప్పించే ప్రయత్నం చేశారని సోమిరెడ్డి వాపోయారు.

వ్యవస్థ మౌనంపై ఆవేదన: ఒక ఉన్నతాధికారి స్థాయి వ్యక్తిని అందరి ముందే అవమానిస్తుంటే, తోటి అధికారులు, మిత్రులు మౌనంగా ఉండటం సోమిరెడ్డి ని మరింత కలచివేసింది. “అన్యాయాన్ని ప్రశ్నిద్దాం రండి” అని ఆయన పిలిచినప్పుడు, తోటి అధికారుల మొఖాల్లో కనిపించిన భయం, వారి మౌనం చూసి ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మిత్రులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. “అరేయ్, ఒరేయ్” అని పిలుస్తూ, కనీస గౌరవం ఇవ్వని చోట ఇన్నాళ్లు ఎలా పనిచేశామా అని ఆయన సిగ్గుతో తలదించుకుంటున్నారు.

ఆత్మాభిమానమే మిన్న: “నేను పెరిగిన వాతావరణంలో ఆత్మాభిమానంతో బ్రతకడమే జీవితమని నమ్మాను. ఆత్మాభిమానం లేని చోట ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు” అని సోమిరెడ్డి తేల్చి చెప్పారు. తన కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చేతకాని, చైతన్యం చచ్చిపోయిన ఒక శాఖలో 30 ఏళ్ల పాటు సేవలు అందించినందుకు విచారం వ్యక్తం చేస్తూ, ఇక ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పని చేయలేనని స్పష్టం చేశారు.

​ఉన్నతాధికారులకు ధన్యవాదాలు: తను ఈ శాఖలో ఇమడలేనని తెలిసినా, ఇన్నాళ్లు ప్రోత్సహించిన మేలుకోరే ఉన్నతాధికారులకు, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేర్చిన మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కానీ తన మనసు పడ్డ గాయం మాత్రం మానలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల మధ్య ఉండాల్సిన కనీస మర్యాదలు లోపించడం, పెత్తందారీ పోకడలు పెరిగిపోవడంపై ఈ ఘటన ఒక చర్చకు దారితీసింది. సోమిరెడ్డి నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.