Chitram news
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 5:44 pm Editor : Chitram news

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి: గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిప్పులు

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి: గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిప్పులు

చిత్రం న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని బీజేఎల్పీ ఉప నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బీజేపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల కృషితో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని ఆయన కొనియాడారు.

గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో ఒక్క కొత్త ఎయిర్ పోర్ట్ కూడా తీసుకురాలేని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరమని ఆయన విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి కనీసం భూసేకరణ కూడా చేయకుండా ఆ పార్టీ చేతులెత్తేసిందని, ఇప్పుడు మాత్రం తామేదో ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని పాయల్ శంకర్ తెలిపారు. దీనికోసం వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నారని, దీనివల్ల స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్‌పోర్టుల పనులను కేంద్రం మాస్టర్ ప్లాన్‌తో అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన వివరించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, కేంద్ర పథకాలతోనే రాష్ట్ర రూపురేఖలు మారుతున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.