ఆర్మూర్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలోని భక్త ఆంజనేయ మందిరంలో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని , ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని , సీసీ కెమెరాల ద్వారా పట్టణంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆర్మూర్ ఎస్ హెచ్ వో సత్యనారాయణ, కౌన్సిలర్ విజయ్ అగర్వాల్ (దియా) , జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షులు రాజేందర్ గౌడ్ , సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ ప్రవీణ్ చారి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
