రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తిదాయకం: సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసీ వీరుడు రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తిదాయకమని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు.ఆయన వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి రాంజీ గోండ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, జల్-జంగిల్-జమీన్ కోసం ప్రాణాలర్పించిన గొప్ప యోధుడు రాంజీ గోండ్ అని కొనియాడారు. ఆయన సాగించిన పోరాటం, చూపిన ధైర్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన ఇటువంటి వీరుల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, ఆశన్న యాదవ్, బండారి దేవన్న, పలువురు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు.
