చిత్రం న్యూస్, న్యూదిల్లీ: ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ కనెక్టివిటీ కల్పించే ప్రక్రియ వేగవంతమైంది. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరియు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిలతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, సివిల్ ఏవియేషన్ అధికారులు, డిఫెన్స్ అధికారులు, వికాస్ రాజ్ గారు, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పాల్గొని ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌పై చర్చించారు.
ఉమ్మడి నిర్వహణతో అభివృద్ధి
ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర విమానయాన అవసరాలతో పాటు భారత వైమానిక దళం (IAF) శిక్షణ అవసరాల కోసం కూడా వినియోగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రక్షణ శాఖ విమానాశ్రయ అభివృద్ధిని చేపట్టగా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సివిల్ టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది.
కీలక అంశాలు:
ఫీల్డ్ సర్వే: ఏప్రిల్ 17న పౌర విమానయాన శాఖ, రక్షణ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో ఓఎల్ఎస్ (OLS) ఫీల్డ్ సర్వే మరియు పెగ్ మార్కింగ్ నిర్వహించనున్నారు.
భూసేకరణ: ఈ ప్రాజెక్టు కోసం అదనంగా 450 ఎకరాల భూమిని సేకరించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
మాస్టర్ ప్లాన్ ఆమోదం: ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికే ఆమోదం పొందిందని ఎంపీ గోడాం నగేష్ వెల్లడించారు.
శంకుస్థాపన: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం.
పారిశ్రామికాభివృద్ధికి బాటలు
ఈ విమానాశ్రయం పూర్తయితే జిల్లాలో పారిశ్రామిక వేగం పుంజుకోవడమే కాకుండా, పర్యాటక రంగం అభివృద్ధి చెంది స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్‌లో ఈ ఎయిర్‌పోర్ట్ ఒక కీలక అనుసంధానకర్తగా మారనుంది.
