-Advertisement-

కస్తూర్బా బాలికల విద్యాలయంను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 

చిత్రం న్యూస్, నిజామాబాద్: వర్ని మండలం కోటయ్య క్యాంపులో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. విద్యార్థుల మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను లోనికి అనుమతించకూడదని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అనంతరం 7వ తరగతి గదిని కలెక్టర్ సందర్శించి, విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన డైరీలు, చాక్లెట్లు, బహుమతులను అందించారు. చక్కగా చదువుకోవాలని, అదే సమయంలో వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ కేటాయిస్తామని అన్నారు. వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ విద్యాలయానికి నూతన భవనం మంజూరైనందున వెంటనే పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నూతన భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ సాయిలు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సరస్వతి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments