చిత్రం న్యూస్,మిర్యాలగూడ: మిర్యాలగూడలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సోమవారం పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను తక్షణమే పూర్తి చేసి, ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతిని ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇళ్లలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు తాగునీటి సరఫరా, విద్యుత్, ప్లంబింగ్, టాయిలెట్లు, కిచెన్ ఏర్పాట్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.లబ్ధిదారులకు నాణ్యమైన వసతులు కల్పించడంలో ఎటువంటి రాజీ పడకూడదని, పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఇళ్లన్నీ సిద్ధం చేసి, ఈ నెల చివరి నాటికి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
