కార్యకర్తల త్యాగాల పునాదులపైనే బీజేపీ నిర్మాణం
ఇందూర్ జిల్లా కార్యాలయంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి
చిత్రం న్యూస్, నిజామాబాద్ జిల్లా బ్యూరో: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారిపార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ..బీజేపీ కేవలం నాయకుల పార్టీ కాదు, అంకితభావం కలిగిన కార్యకర్తల పార్టీ. సైద్ధాంతిక నిబద్ధతతో పనిచేసే కార్యకర్తల కఠోర శ్రమ వల్లే ఈరోజు బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు.
కోట్లాది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అనుక్షణం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న ఏకైక పార్టీ మనదే. ‘ముందు దేశం, తర్వాత పార్టీ, చివరికి నేను’అన్న నినాదంతో బీజేపీ కార్యకర్తలు జాతి నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తున్నారు.
డాక్టర్. శ్యామా ప్రసాద్ ముఖర్జీ వేసిన బలమైన పునాదులపై, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రవచించిన ‘ఏకాత్మ మానవతావాదం’, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరాలనే ‘అంత్యోదయ’ సిద్ధాంతాల ఆధారంగా పార్టీ నిర్మితమైంది. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కే. అద్వానీ లాంటి అగ్ర నేతల మార్గదర్శనంలో ఎదిగి.. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భరతమాతను ‘విశ్వ గురువు’గా నిలిపే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.
ఇందూర్ జిల్లాలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రాణత్యాగం చేసిన అమరులను, నక్సలైట్ల అమానుష దాడుల్లో బలైన వీర కార్యకర్తలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. వారి త్యాగాలు పార్టీకి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలుపుతూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఘనంగా నివాళులర్పించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడం, అధికారంలోకి రావడం తథ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్రవంతి రెడ్డి, పొతన్ కార్ లక్ష్మీనారాయణ, గద్దె భూమన్న, నగ్గోల్ల లక్ష్మి నారాయణ. న్యాలం రాజు. బద్దం కిషన్. పుట్ట వీరేందర్. జ్యోతి, కార్పోరేటర్లు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
