Chitram news
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 4:28 pm Editor : Chitram news

ఆదిలాబాద్ అభివృద్ధికి అంతా ఐక్యంగా కృషి చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా మహనీయుడు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. “మహనీయులు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి జీవితాల్లోని కనీసం 10 శాతం ఆశయాలను మనం ఆచరించినా సమాజంలో గొప్ప మార్పు వస్తుంది” అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా సమాజంలో ఇంకా కొన్ని సమస్యలు పీడిస్తున్నాయని, వాటిపై బహిరంగ చర్చలు జరిపి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి:

ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా తనకు వచ్చిన అవకాశాన్ని జిల్లా సమగ్ర అభివృద్ధికి వినియోగిస్తున్నానని పాయల్ శంకర్ తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా, వర్గ విభేదాలు లేకుండా అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు