చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు భుక్తాపూర్‌లోని 49వ వార్డులో ‘ఇంటింటికి సీపీఐ ‘ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చి పెత్తందారుల పక్షాన నిలుస్తోందని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించారు. దేశ నిర్మాణంలోనూ, స్వతంత్ర భారత పోరాటంలోనూ కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజలు విరాళాలు అందించి ఆశీర్వదించాలని కోరారు.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి మాట్లాడుతూ,బీజేపీ దేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందుతోందని విమర్శించారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఎస్. అరుణ్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కామ్లే రామ్ దాస్, గంగమ్మ, పెద్ది మధు, గిరిజన సంఘం జిల్లా నాయకులు కో సురేష్, బెజ్జంకి నర్సింగ్ రావు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నిధి కోసం విరాళాలు సేకరించారు.
