చిత్రం న్యూస్, డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.247.94 కోట్ల అదనపు గ్రాంట్లను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విడుదలైన ఈ నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆరు రాష్ట్రాలకు రూ.1500 కోట్లకు పైగా గ్రాంట్లను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన పంచాయతీ రాజ్ సంస్థలకు రూ.247.94 కోట్ల అన్ టైడ్ గ్రాంట్స్ కేటాయించబడ్డాయి. ఈ నిధులు రాష్ట్రంలోని 12,600 గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులకు ఉపయోగపడతాయి.
గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం, ఈ నిధులను అభివృద్ధి పనులకు మాత్రమే కేటాయించాలి తప్ప, ఉద్యోగుల జీతాలు లేదా కార్యాలయ నిర్వహణ ఖర్చులకు ఉపయోగించరాదు గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం, ఈ నిధులను అభివృద్ధి పనులకు మాత్రమే కేటాయించాలి తప్ప, ఉద్యోగుల జీతాలు లేదా కార్యాలయ నిర్వహణ ఖర్చులకు ఉపయోగించరాదు.
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత గ్రాంట్లుగా ఈ నిధులను కేటాయించారు. ఈ నిధుల వినియోగం గ్రామ సభ ఆమోదంతో జరగాలి. మురుగు కాల్వల మరమ్మత్తులు, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, శ్మశాన వాటికల నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నిర్ణయం తెలంగాణ గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. నిధుల వినియోగంపై పారదర్శకత పాటించాలని కేంద్రం సూచించింది.


