చిత్రం న్యూస్,ఆదిలాబాద్:జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ ను జడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మార్ట్‌లోని వివిధ విభాగాలను కలియతిరిగిన ఆమె, ఆదివాసీ మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ఆదివాసీ మహిళలు పండించిన సేంద్రియ ఆహార పదార్థాలు, పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు మరియు అటవీ ఉత్పత్తుల నాణ్యతను ఆమె అభినందించారు. మహిళలు రూపొందించిన వినూత్న హస్తకళా వస్తువులను చూసి, వారిలోని నైపుణ్యాన్ని సుహాసిని రెడ్డి కొనియాడారు. స్థానిక మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. “ఆదివాసీ మహిళల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే ప్రతి ఒక్కరూ ఈ మహిళా మార్ట్‌ను సందర్శించి, ఇక్కడ లభించే నాణ్యమైన, స్వచ్ఛమైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మన ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబనకు, వారి కుటుంబాల అభివృద్ధికి అండగా నిలవాలి” అని సుహాసిని రెడ్డి ఈ సందర్భంగా కోరారు.



