చిత్రం న్యూస్, మార్కాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం (మార్కాపురం) జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
వివరాల్లోక వెళితే.. రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవదహనమయ్యారు.
క్షణాల్లోనే అంటుకున్న మంటలు
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రాయవరం క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ధాటికి డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లోనే మంటలు రెండు వాహనాలకు వ్యాపించాయి. మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, ప్రయాణికులు తమ సీట్ల నుండి లేచి బయటకు వచ్చే లోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు. కొందరు కిటికీలు పగులగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకుపోయిన 10 మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది




